నిజామాబాద్, ఫిబ్రవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు, సైబర్ ఫైనాన్సియల్ నేరాల గురించి 155260 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టారు. బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు.
సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడం లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని, సాంకేతిక పద్ధతులకు తగ్గట్టుగ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నదని, ఇందుకోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి డయల్ 100 ద్వారా కూడా సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 155260 నెంబర్ ప్రవేశపెట్టిందని దీని ద్వారా కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని, ప్రధానంగా బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణం నిలిపివేసి సంబంధిత వారి యొక్క ఖాతాను ఫ్రీజ్ చేసే విధంగా చూడవచ్చని, సైబర్ నేరాలు కేసుల్లో పూర్తిస్థాయి ఆధారాలను సేకరించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందనీ, వారికి శిక్ష పడేలా చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని సిపి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం గోడప్రతులను పోలీస్ కమిషనర్ కె. ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో విడుదల చేశారు.