నిజామాబాద్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సత్ఫలితాలు సాధించాలనే కృతనిశ్చయంతో ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు.
యూనిట్ల గుర్తింపు అత్యంత కీలకం అయినందున లబ్దిదారులకు వారు ఆసక్తి కలిగి ఉన్న వాటిని ఎంపిక చేసుకునేందుకు వీలుగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆయా రంగాలకు సంబంధించి వందకు పైగా యూనిట్లను గుర్తిస్తూ సమగ్ర వివరాలతో జాబితా రూపొందిస్తున్నామని తెలిపారు. వరుసగా రెండవ రోజైన గురువారం సైతం స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి దళిత బంధు పథకం యూనిట్ల గుర్తింపు పై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ఉద్యానవన, వ్యవసాయ తదితర శాఖల ఆధ్వర్యంలో నెలకొల్పేందుకు అనువైన యూనిట్లు ఏమిటీ అనే అంశాలపై కూలంకషంగా చర్చ జరిపారు. పాలీ హౌస్, నెట్ హౌస్ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ఆహ్వానించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పాలీ హౌస్, నెట్ హౌస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఎంత వ్యయం అవుతుంది, దిగుబడి ఏమేరకు వస్తుంది, నికరలాభం ఎంత మిగులుతుంది ఇత్యాది విషయాలతో పాటు పంటల సాగులో సాధక బాధకాల గురించి రైతులు సమావేశంలో తమ అనుభవ పూర్వక అంశాలను అధికారుల తోడ్పాటుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
పసుపు ఉడకబెట్టే యంత్రం, పాలిషింగ్ డ్రమ్స్, ఫ్రూట్ షాప్స్ తదితర వ్యాపారాల్లో లాభనష్టాలు, నిర్వహణ తీరుతెన్నుల గురించి సంబంధిత వ్యాపారులు తమ అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. పాలీహౌస్ విధానం ద్వారా కేవలం అర ఎకరం విస్తీర్ణంలోనే ఆర్కిడ్ పుష్పాల పంటను సాగు చేస్తూ నికరంగా డెబ్బై వేల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నట్టు కమ్మర్పల్లి మండలం హాసకోతూర్ గ్రామానికి చెందిన భుక్యా మోహన్ అనే రైతు తెలిపారు.
అదేవిధంగా గోవింద్, బాలకృష్ణ తదితర రైతులు సైతం పంటల సాగు స్థితిగతుల గురించి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంటల సాగులో అధునాతన పద్ధతులను అవలంభిస్తే అధిక దిగుబడులను సాధించి అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. పంటల సాగుతో పాటు వివిధ రంగాలలో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి అనుభవాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటూ నిబంధనలకు అనుగుణంగా దళిత బంధు యూనిట్ల తుది జాబితాను రూపొందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మకరంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.