నిజామాబాద్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో, ఆయా పథకాల ద్వారా మంజూరైన నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి అయ్యేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్ నుండి ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్‌పీటీసీలతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, ఉపాధి హామీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సిడిపి, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, రూర్బన్ తదితర వాటి కింద చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి విషయమై చర్చించారు. పనులను ప్రారంభించడానికి ఏవైనా ఆటంకాలు వుంటే తమ దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ప్రజాప్రతినిధులను కోరారు. ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేకపోయిన వాటి విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రికరించాలని సూచించారు.
ఆర్ధిక సంవత్సరం ముగియడానికి మరికొంత కాలమే వ్యవధి మిగిలి ఉన్న నేపధ్యంలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిపిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు చొరవ చూపాలన్నారు. సాధ్యమైనంత వరకు మార్చ్ 31వ తేదీ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని, పనులను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు సహకారం అందించాలన్నారు.
ప్రస్తుతం పనులను చేపట్టి పూర్తి చేసేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అన్నారు. అకాల వర్షాల బెడద లేకుండా, ఇప్పటికే వ్యవసాయ పనులు దాదాపు పూర్తి అయినందున అభివృద్ధి పనులకు కూలీలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంటారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలు, వివిధ పథకాల కింద మంజూరైన అన్ని పనులను తక్షణమే చేపట్టి వేగవంతంగా పూర్తి చేసేలా చొరవ చూపాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఎక్కడైనా భూసేకరణ, ఇసుక కొరత వంటి ఇబ్బందులు ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించాలని తహసీల్దార్‌లు, ఆర్‌డీఓలను ఆదేశించామన్నారు.
ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 38 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు మంజూరీ తెలిపినందున, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు మూడు వారాల్లో పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. తప్పనిసరిగా నిధులు మంజూరు అవుతాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజా ప్రతినిధులు చొరవ చూపించినట్లయితే జిల్లాలో సుమారు రూ. 200 కోట్ల పైచిలుకు విలువ చేసే ప్రజాపయోగ పనులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా, ఇతర జిల్లాల కంటే కనీసం పక్షం రోజుల ముందు పనులు పూర్తి చేస్తే, నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని, సకాలంలో బిల్లులు పొందవచ్చని పేర్కొన్నారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు పాల్గొన్నారు.