ఒక్క మొక్క పోయినా కఠినంగా వ్యవహరిస్తాం…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో పాటు ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితర శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వ్యాక్సినేషన్‌, ఉపాధి హామీ కింద కూలీలకు విస్తృత స్థాయిలో పనులు కల్పించడం, హరితహారం మొక్కల నిర్వహణ, అభివృద్ధి పనుల వేగవంతం తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో కొన్ని పీహెచ్‌సీలు వెనుకబడి ఉంటున్నాయని అన్నారు. ప్రతి రోజు ఒక్కో పీహెచ్‌సి పరిధిలో కనీసం 400 లకు తగ్గకుండా సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ జరుపుతూ త్వరితగతిన లక్ష్యాన్ని సాధించాలన్నారు.

విద్యా సంస్థలు పునఃప్రారంభం అయినందున 15 నుండి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికి టీకాలు ఇచ్చేలా చూడాలన్నారు. ఏ ఒక్క పాఠశాల కూడా మినహాయించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను సమాయత్తం చేసి నాలుగు రోజుల్లో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కలెక్టర్‌ హెచ్చరించారు.

ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్‌లతో సమన్వయం ఏర్పరచుకొని ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీవోలు, తహశీల్దార్‌లు కూడా వ్యాక్సినేషన్‌ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కాగా, ఉపాధి హామీ పనులను విరివిగా గుర్తిస్తూ, పెద్ద సంఖ్యలో కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రతీ మండలం పరిధిలో ఉపాధి పనులలో కూలీల ప్రాతినిధ్యం క్రమ క్రమంగా పెంచాలన్నారు. అదేవిధంగా హరితహారం మొక్కల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. రహదారులకు ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను చక్కబెట్టుకోవాలని, తాను పరిశీలనకు వచ్చినప్పుడు ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ 63 జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కల సంరక్షణ పనులను శనివారం లోగా పూర్తి చేయాలని గడువు విదించారు. అలాగే నిజామాబాద్‌ బాసర రహదారి, వర్ని చౌరస్తా నుండి రుద్రూర్‌ వరకు, నిజామాబాద్‌ మోపాల్‌, వేల్పూర్‌ క్రాస్‌ రోడ్డు నుండి భీంగల్‌ వరకు, నిజామాబాద్‌ నందిపేట్‌ మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా ఆవెన్యూ ప్లాంటేషన్‌ను తక్షణమే చేపట్టి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎక్కడైనా ఒక్క మొక్క పోయినా కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా, అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారుల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అన్ని మండలాల్లో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పనుల విషయమై చర్చించుకుని ముందుకెళ్లాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »