నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మంజూరీలు తెలుపబడిన ప్రజోపయోగ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కలేక్టరేట్ నుండి ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్దీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, ఉపాధి హామీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నియోజకవర్గ అభివృద్ది, ఎంపీ లాడ్స్, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, రూర్బన్ తదితర వాటి కింద చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి విషయమై చర్చించారు. ఆర్ధిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా మార్చ్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాలికాబద్దంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అని కలెక్టర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా అవసరమైన మేరకు ఇసుక లభ్యత ఉంటుందని, అయితే ఇసుకను నిర్దేశిత పనులకే వినియోగించాలని, దారిమల్లించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పనులను ప్రారంభించడానికి ఏవైనా ఆటంకాలు వుంటే తమ దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేకపోయిన వాటి విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రికరించాలని, పనుల బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించి, నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
నిబంధనలకు అనుగుణంగా సకాలంలో బిల్లులు మంజూరు చేసినట్లైతే పనులు వేగవంతంగా జరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని రకాల అనుమతులు లభించినప్పటికీ పనులను జరిపించకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు వారికి అందుబాటులోకి రాకుండా పోతాయని, అలా జరిగితే మనం విధుల్లో ఉండి ప్రయోజనం ఉండదన్నారు. సాధ్యమైనంత వరకు మార్చ్ 31వ తేదీ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని, పనులను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పకడ్బంది పర్యవేక్షణ జరిపితే గడువులోపే పనులు తప్పనిసరిగా పూర్తవుతాయని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలు, వివిధ పథకాల కింద మంజూరైన అన్ని పనులను తక్షణమే చేపట్టి వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. కేవలం రెండు నెలలు కష్టపడి పని చేస్తే కోట్లాది రూపాయల విలువ చేసే పనులను ప్రజలకు ఉపయోగపడేలా చేయవచ్చని, తద్వారా అధికారులకు కూడా మంచి పేరు వస్తుందన్నారు. ఎక్కడైనా భూసేకరణ, ఇసుక కొరత వంటి ఇబ్బందులు ఉంటే ఆర్‌డీఓలు, తహసీల్దార్‌లు పరిష్కరించాలని ఆదేశించారు.
పనులను మాత్రం ప్రధానంగా ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించాలని హితవు పలికారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైనా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు మూడు వారాల్లో పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. మార్చి మొదటివారం లోపు పనులను చేపడితే నిధులు ఇప్పించే బాధ్యత తనదేనని కలెక్టర్ భరోసా కల్పించారు.
ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను పెండిరగ్‌లో ఉంచితే ఊరుకునే ప్రసక్తే లేదని, అందువల్ల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రణాలికాబద్దంగా పనులు జరిపించాలని కలెక్టర్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ కలెక్టర్ మకరంద్, జడ్పీ సిఈఓ గోవింద్, డీఆర్‌డీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు.