నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రగతి పనుల విషయమై కలెక్టర్ శుక్రవారం సంబంధిత అధికారులతో తన చాంబర్ లో సమీక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.
సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అద్దె భవనాలలో కొనసాగుతున్నయన్న వివరాలను అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సొంత భవనాల నిర్మాణాల కోసం అనుమతులు మంజూరైన వాటికి స్థలం అందుబాటులో ఉంటే తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్న చోట పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటిలోగా అవి పూర్తవుతాయని అధికారులను ఒక్కో శాఖ వారీగా ఆరా తీశారు.
ఒక్క రోజు కూడా సమయం వృధా కానివ్వకుండా నిర్విరామంగా పనులు జరిపిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయించాలని సూచించారు. ప్రస్తుతం నిర్మాణ పనులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అయినందున గడువు కంటే ముందే పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మాసాల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ గడువు విధించారు.
ప్రభుత్వ సంక్షేమ బడుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధానంగా నీటి వసతి, టాయిలెట్స్ వసతులు తప్పనిసరి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. సమావేశంలో సంక్షేమ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.