కామారెడ్డి, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కానారేెన్స్ హాల్‌లో శుక్రవారం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థినిలకు ఉపకార వేతనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కెనరా బ్యాంక్ విద్యా జ్యోతి పథకం కింద ఉత్తమ విద్యార్థినీలకు ఉపకార వేతనాలు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. బాలికలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడారు. 5వ తరగతి నుంచి ఏడవ తరగతి చదువుతున్న ఉత్తమ విద్యార్థినిలకు రూ.2,500, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న ఉత్తమ విద్యార్థినిలకు రూ. ఐదు వేల చొప్పున ఉపకార వేతనాలు తమ బ్యాంకు అందిస్తోందని పేర్కొన్నారు. బాలికలు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ రాజీవ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, బ్యాంకు అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.