నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మల్కాపూర్, అబ్బాపూర్ (ఎం) గ్రామ శివార్లలో హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ, ఉపాధి హామీ ఎపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఇజిఎస్ సిబ్బంది అందరికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం జానకంపేట్, బాసర మార్గంలో జిల్లా సరిహద్దు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా మల్కాపూర్, అబ్బాపూర్ (ఎం) శివార్లలో మొక్కలు ఎండిపోవడం, ట్రీగార్డులు కింద పడిపోవడం, మొక్క చుట్టూ సాసరింగ్ చేయకపోవడం, మొక్కలకు నీరందించకపోవడం వంటి లోపాలను గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున వెచ్చిస్తూ నాటిన మొక్కల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోందని అన్నారు.
హరితహారం ప్రాధాన్యత గురించి తాము పదేపదే చెబుతూ, స్వయంగా తాను తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిని ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన వారందరికీ మెమోలు జారీ చేయాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ చేపడుతున్న పనుల విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ గురుతర బాధ్యతను విస్మరిస్తూ విధులను అలక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రధాన రహదారి అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణే సక్రమంగా లేకపోతే, మిగతా చోట్ల మొక్కల సంరక్షణ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఏ ఒక్క మొక్క కూడా చనిపోకుండా క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని సూచించారు. కాగా, హరితహారం మొక్కలు ధ్వంసం అయ్యేందుకు కారణం అవుతున్న వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులతో పాటు, గ్రామ పంచాయతీల సర్పంచులకు కలెక్టర్ సూచించారు.
సచివాలయాలకు విశేషమైన అధికారాలు ఉంటాయని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మొక్కల నిర్వహణలో ఎంతమాత్రం రాజీ పడకూడదని హితవు పలికారు. రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్న చోట నిర్మాణ ప్రదేశాలను వదిలివేస్తూ, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించాలని, విద్యుత్‌తీగల కింద మొక్కలు నాటకూడదని కలెక్టర్ సూచించారు. హరితహారం పనుల్లో పాల్గొంటున్న కూలీలకు వారు చేసిన పనిని అనుసరిస్తూ నిబంధనలకు అనుగుణంగా వెంటదివెంట వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.