కామారెడ్డి, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ప్రధానోపాధ్యాయులు చొరవ చూపి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేయించాలని కోరారు.
పరిశుభ్రంగా ఉన్న పాఠశాలలను గుర్తించి స్వఛ్ఛ పురస్కార్ కోసం మండల స్థాయి విద్యాధికారులు ప్రతిపాదనలు పంపాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడారు. జిల్లాలో 13 వేల 166 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి 120 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయ పథం పదవ తరగతి విషయ విశ్లేషణ, మాదిరి ప్రశ్నావళి పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లింగం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారిని రజిత, విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్, బలరాం, గంగా కిషన్, రామస్వామి, శ్రీపతి, మనోహర్, సిద్ది రామ్ రెడ్డి, శ్రీకాంత్, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.