నిజామాబాద్, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదనపు డీజీపీ సందీప్ శాండిల్య సూచించారు. సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించగల్గుతామని, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు.
శనివారం ఆయన హైదరాబాద్ నుండి రోడ్డు భద్రత కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఆయా జిల్లాల రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులకు జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కమిటీకి చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, రవాణా శాఖ ఉప ప్రాంతీయ కమిషనర్ డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ వివరించారు. జిల్లా మీదుగా 44, 63వ నెంబర్ జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల అక్కడక్కడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ముఖ్యంగా 44వ జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోందన్నారు. తరుచూ ఒకేచోట ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాలకు గల కారణాలపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పలుమార్లు అధ్యయనం జరిపించామని అన్నారు.
అధ్యయనంలో వెల్లడైన అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టిగానే కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదాలకు అతివేగం ప్రధాన కారణంగా నిలుస్తున్నందున జాతీయ రహదారులతో పాటు ఇతర అన్ని మార్గాలలోనూ వాహనాల వేగాన్ని నియంత్రణకై నిరంతర కృషి చేస్తున్నామని పోలీస్ కమిషనర్ నాగరాజు పేర్కొన్నారు. సమావేశంలో పోలీస్, రవాణా శాఖతో పాటు ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.