డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్. రమేష్ లకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల మినీ సెమినార్ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు.
మాస్ కమ్యూనికేషన్ బిఓస్ చైర్మన్ డా. ప్రభంజన్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సట్లపల్లి సత్యం ‘‘తెలంగాణ దళిత పత్రికలు ఆవిర్భావం, వికాసం ఒక పరిశీలన’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సోషల్ సైన్స్ డీన్, మాస్ కమ్యూనికేషన్ విభాగ ప్రొఫెసర్ ఆచార్య కె. శివ శంకర్ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి సిహెచ్. రమేష్ ‘‘తెలంగాణ దృక్పథంలో శ్యాం బెనగల్ ఫిలింస్‌లో గల సామాజిక సమస్యలు విశ్లేషణాత్మక అధ్యయనం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సుధీర్ కుమార్ హాజరై పరిశోధకులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో దళిత పత్రికల మీద మొట్ట మొదటి పరిశోధన అని, ప్రధాన స్రవంతి మీడియాతో పాటు ఎదుగుతున్న దళిత పత్రికలు వాటి ప్రస్థానం వికాసం, సామాజిక స్పృహలో వాటి బాధ్యతలు వంటి అనేక అంశాలపై విస్తృతమైన పరిశోధన చేసినందుకు సట్లపల్లి సత్యంను అభినందించారు.
అదే విధంగా శ్యాం బెనగల్ చలన చిత్రాలలో గల సామాజిక దృక్పథం మీద కూడా పరిశోధన చేసిన కె. రమేష్‌ను అభినందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం సామాజిక, సాంస్కృతిక, పత్రికా, చలనచిత్రాల ప్రాధాన్యం మీద విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయని ప్రశంసించారు. వైవా వోస్‌కు సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కె. శివ శంకర్ చైర్మన్‌గా, బిఓఎస్ చైర్మన్ డా. ప్రభంజన్ యాదవ్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
మాస్ కమ్యూనికేషన్ విభాగధిపతి డా. ఘంటా చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శాంతాబాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ డా. మోహన్ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సట్లపల్లి సత్యం, సిహెచ్. రమేష్‌లు పిహెచ్. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, కంట్రోలర్ డా. అరుణ, పరిశోధక విద్యార్థులు శ్రీనివాస్, రవి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.