నిజామాబాద్, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొవిడ్ కేసులు పెరగడంతో గడిచిన రెండు వారాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చే ప్రజావాణిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రజావాణిలో సమస్యలు విన్నవించేందుకు, అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒకే చోట గుమిగూడి ఉండకూడదని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ప్రజలు పై విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.