ఆర్మూర్, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు అర్హుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు కాకుండా అధికారులకే అప్పగించాలని, అర్హుల ఎంపిక లో నిరుపేదలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, దళిత బందును పేదల బందుగా మార్చి అన్ని కులాలలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, సుమన్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్టుగా వంద కుటుంబాలకు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాలలో రెండు గ్రామాలను ఎంపిక చేసి 100 కుటుంబాలకు అందిస్తామని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కీలకం చేస్తామని ప్రకటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పథక అమలుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పగిస్తే ఈ పథకం పూర్తిగా అధికార పార్టీ అనుచరులకు తప్ప నిజమైన అర్హులకు మొదటగా అందే అవకాశాలు ఉండవని వారు అన్నారు.
ఈ పథకం దళిత సాధికారత పేరుతో దళితుల అభివృద్ధికి అమలు చేస్తున్నామని చెబుతూ దశలవారీగా చేస్తామని చెబుతూ ఎన్నికల స్టంట్‌గా ఏళ్లకు ఏళ్లు డబల్ బెడ్‌రూమ్ మాదిరిగా అయ్యే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఈ పథకం అమలులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలను కాకుండా అధికారులకు పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చి గ్రామస్థాయిలో వారి ఆర్థిక స్థితి ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగేలా విచారణ చేయించాలని తద్వారా నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం మొదటగా అందుతుందని అప్పుడే ఈ పథకం యొక్క ఉద్దేశానికి సార్థకత చేకూరుతుందని కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
దళిత బంధు పథకాన్ని పేదల బంధుగా మార్చి అన్ని కులాలలో ఉన్న పేదలందరికీ ఇచ్చే పథకంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు బి.రవి, పట్టణ ఉపాధ్యక్షులు భోజెంధర్, కిషోర్, అనిల్ పాల్గొన్నారు.