కామారెడ్డి, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగన్‌వాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు.
మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మత్తుపదార్థాల నిషేధంపై ప్రతిజ్ఞ అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో చేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రతిజ్ఞ చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల వారీగా అధికారులు తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.