నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల 2022 -2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన పై బల్దియాల అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలోని చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు.
నిజామాబాదు నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, అకౌంట్స్ విభాగం అధికారులు పాల్గొని ఆయా బల్దియాల ఆదాయ వ్యయాల తీరుతెన్నుల గురించి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పన్నుల రూపేణా సమకూరుతున్న రాబడి ఎంత, తైబజార్, పెనాల్టీలు, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు, హోర్డింగ్స్ తదితర మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం వివరాలను కలెక్టర్ ఒక్కో మున్సిపాలిటీ వారీగా సంబంధిత అధికారులను ఆరా తీశారు.
పట్టణ ప్రగతి, 15 వ ఆర్ధిక సంఘం ద్వారా సమకూరుతున్న నిధులు, ప్రభుత్వ గ్రాంట్లు, ఇత్యాది పథకాల ద్వారా బల్దియాలకు అందుతున్న నిధుల వివరాలను, వాటిని ఏయే పనుల కోసం వెచ్చిస్తున్నారన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయా మున్సిపాలిటీలు రూపొందించుకున్న బడ్జెట్‌కు అనుగుణంగానే ఆదాయ వనరులు సమకూరాయా? లేదా? అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు.
వాస్తవ ఆదాయ వనరులను పక్కాగా అంచనా వేస్తూ, తదనుగుణంగానే 2022 – 2023 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. బడ్జెట్ నివేదికలో సమగ్ర వివరాలను పొందుపర్చాలని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. కాగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో నిర్ణీత గడువులోగా పన్నులను పూర్తి స్థాయిలో రాబట్టేందుకు కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు.
వంద శాతం లక్ష్య సాధన కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిధులు సమకూర్చుకోగలిగినప్పుడే నగర, పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా మున్సిపాలిటీల్లో పలు విభాగాల్లో ఆదాయం తక్కువగా సమకూరినందున, ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి స్థాయి రాబడి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, ఈ గణాంకాలను బేరీజు వేసుకుంటూ 2022 – 2023 బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని అన్నారు.