నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తమతమ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, లేదా జూమ్ మీటింగ్ పెట్టుకుని తమ కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష జరిపితేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని అన్నారు.
సోమవారం కలెక్టరేటులోని ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తరుచూ శాఖా పరమైన సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అధికారులు, సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను ఏ మేరకు సాధించారు, ఎవరు వెనుకంజలో ఉండిపోతున్నారన్నది తెలుసుకోగలుగుతామని, తద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపడి ప్రగతి పనుల సాధనకు దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఉదయం వేళల్లో తనిఖీలు చేస్తూ, సాయంత్రం సమయాల్లో సమీక్షలు జరపాలన్నారు. ఇకపై తాను స్వయంగా ఆయా శాఖల జిల్లా అధికారులు వారివారి శాఖాపరంగా సమీక్షలు నిర్వహిస్తున్నారా, లేదా అన్నది స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, వైద్యారోగ్యం, విద్య, ఐసిడీఎస్, డీఆర్‌డీఓ తదితర శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు ఏర్పాటు చేసుకుని ఆయా శాఖల పనితీరు మరింతగా మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.
దైనందిన కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తూ, ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకుండా వెంట వెంట పరిష్కరించాలని సూచించారు. కాగా, విద్యా సంస్థలు పునః ప్రారంభం అయినందున పాఠశాలలు, వసతి గృహాలను జిల్లా అధికారులు తనిఖీలు చేస్తూ పరిస్థితులు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. ఎక్కడైనా సదుపాయాల లేమి ఉంటే సౌకర్యాల కల్పనా కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా హరితహారం మొక్కల నిర్వహణ విషయంలో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రతీ మొక్కను బతికించే బాధ్యత జిల్లా అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల ఆవరణలు, ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలకు వచ్చే నాలుగు మాసాల పాటు క్రమం తప్పకుండా నీటిని అందించేలా చూడాలని, మొక్కలు ఏపుగా పెరిగేందుకు గాను వాటికి సరిపడా ఎరువు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జాతీయ రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణకు సంబంధించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యిందని, ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు స్పెషల్ డ్రైవ్‌పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్‌డీఓ చందర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.