కామరెడ్డి, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా చేయడం వల్ల ఆనందం, శాంతియుతంగా జీవించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. 75 కోట్ల సూర్యనమస్కారాల్లో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్లు చేయించడంతో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రిజిస్ట్రేషన్లు చేయడంలో వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు, యోగ ఆచార్యుల కృషి అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా యోగ ఆసన, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి మాట్లాడారు. 183 రోజులుగా ప్రతిరోజు 13 యజ్ఞ సహిత సూర్య నమస్కారాలు చేస్తున్నామని చెప్పారు. చికిత్స యజ్ఞం గురించి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి లలో ప్రచారం చేశామని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో యోగా కేంద్రాలు నిర్వహించామని చెప్పారు.
ఎవరికి కోవిడ్ రాలేదని సూచించారు. ఈ సందర్భంగా పేట వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో యోగ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, భారత్ స్వాభిమాన్ జనరల్ సెక్రెటరీ రఘు కుమార్, పతంజలి యోగ సమితి అధ్యక్షుడు పెట్టి గాడి అంజయ్య, మహిళా పతంజలి యోగ అధ్యక్షురాలు అరుణ, యోగ శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.