నిజామాబాద్, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు వివిధ పథకాల కింద మంజూరీలు తెలిపిన వాటిలో ఇప్పటికే సింహభాగం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, మిగతా పనులను తక్షణమే చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని అన్నారు.
మంగళవారం భీంగల్ మున్సిపల్ పట్టణం పరిధిలోని నందిగల్లి, బోయిగల్లి , పాటిగల్లీ, ముచ్కూర్ క్రాస్ రోడ్, మదర్సా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. వైకుంఠధామాల నిర్మాణాలు, అర్బన్ పార్క్, మినీ పార్కులు, ఓపెన్ జిమ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్ తదితర నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తూ పనులు ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భీంగల్ తహశీల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో పనులు ప్రగతి విషయమై ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిన్న మొన్నటివరకు కరోనా ఉద్ధృతి, ధాన్యం సేకరణ, వ్యవసాయ పనుల సీజన్ తదితర కారణాల వల్ల అభివృద్ధి పనులు నిర్మాణాలు ఒక మోస్తారుగా కొనసాగాయని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున ప్రజోపయోగ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రజా ప్రతినిధుల సహకారంతో, పరస్పర సమన్వయాన్ని పెంపొందించుకుని నిర్ణీత గడువు కంటే ముందే ప్రగతి పనుల పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్ డీ ఓ శ్రీనివాస్, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.