అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రజల సౌకర్యార్ధం మంజూరు చేయబడిన పనులను తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజోపయోగ పనులు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా సత్వరమే అభివృద్ధి పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదార్లకు హితవు పలికారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి బుధవారం ఆర్మూర్‌ మున్సిపల్‌ పట్టణం పరిధిలో కొనసాగుతున్న వైకుంఠధామాలు, అర్బన్‌ పార్క్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, నర్సరీ, పట్టణ ప్రకృతి వనం తదితర ప్రగతి పనులను పరిశీలించారు. పట్టణ ప్రకృతి వనం నిర్వహణ సక్రమంగా లేకపోవడం పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్బన్‌ పార్కులో పచ్చదనం అంతంతమాత్రంగానే ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌, పరిస్థితిని చక్కదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాను పక్షం రోజుల్లోపు మళ్ళీ తనిఖీకి వస్తానని, లోపాలను సరిచేసుకోవాలని అన్నారు.

పనుల పరిశీలన అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి స్థానిక ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వినీత పండిత్‌తో కలిసి ఆర్‌డీఓ ఛాంబర్‌లో ప్రగతి పనుల విషయమై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల నిర్మాణాలను వేగవంతంగా జరిపించేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరు చేసిన పనులన్నీ గ్రౌండిరగ్‌ జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

ఎక్కడైనా పనులు చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలని, అవసరమైన పక్షంలో ఇసుక నిల్వలను కూడా సమకూరేలా చూస్తామన్నారు. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను ప్రభించని పక్షంలో అలాంటి వారికి నోటీసులు జారీ చేసి కాంట్రాక్టు రద్దు చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 31 వ తేదీ లోపు పనులన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు.

నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే, బిల్లులను ఇప్పించే బాధ్యత తనదేనని కలెక్టర్‌ గుతేదార్లకు భరోసా కల్పించారు. అలా కాకుండా పనులను చేపట్టే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే, సదరు కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని అన్నారు. పనులు సకాలంలో చేపట్టి నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు జరుపుతున్న వారికి నిబంధనలకు లోబడి వెంటదివెంట బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని అన్నారు.

ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు పక్షం రోజుల్లో పూర్తి చేయాలని, మామిడిపల్లి, బకూర్గుట్ట వద్ద వైకుంఠధామాల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించేలా చూడాలని, స్లాటర్‌ హౌస్‌ షెడ్‌ నిర్మాణం పనులు గురువారం నుండి మొదలు కావాలని, సర్వసమాజ్‌ స్మశాన వాటిక వద్ద లైటింగ్‌ ఏర్పాటు పనుల కోసం తక్షణమే టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని, 14 వార్డులో ఓపెన్‌ జిమ్‌తో పాటు, ఆయా చోట్ల సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్దీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »