కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా అదనపు డిజిపి సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం జరిగిన కామారెడ్డి జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు రోడ్డు కండిషన్ కూడా బాగా లేకపోవడం కారణాలు అని అన్నారు.
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు గైకొని ప్రమాదాలను నివారించాలని సూచించారు. రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం, వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానా విధించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ఇందుకు తరచుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస రెడ్డి, ఆర్టీవో డాక్టర్ ఎన్ .వాణి, జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి రాజు, ఆర్ అండ్ బి ఈఈ, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు, రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.