నిజామాబాద్, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్తు పదార్థాల నిర్మూలన కోసం మరే ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాలలో ముఖ్యంగా అనేక సామాజిక రుగ్మతలకు కారణభూతంగా నిలుస్తున్న గంజాయిని సాగు చేస్తున్న వారికి సంక్షేమ పథకాల అమలును నిలిపివేయాలని బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు.
ప్రభుత్వ సదాశయాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరు మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక న్యూ అంబెడ్కర్ భవన్‌లో పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు అధ్యక్షతన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయరెడ్డి మాట్లాడుతూ, సత్ప్రవర్తన కలిగిన పౌరులతో కూడిన సమాజం సత్వర ప్రగతిని సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, నూటికి నూరు శాతం సత్ప్రవర్తన కలిగిన సమాజంగా మారాలనే ఉదాత్తమైన ఆశయంతో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. రేపటి పౌరులైన నేటి బాలలు మత్తు పదార్థాలు బానిసలుగా మారినట్లైతే, వారు విచక్షణను కోల్పోయి పశు ప్రవర్తనను అలవర్చుకుని తమతమ కుటుంబానికే కాకుండా యావత్ సమాజానికే హానికరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.
ఈ విషయాన్ని గుర్తెరిగి సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలన కోసం తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమకెందుకులే అని మిన్నకుండిపోతే మత్తుకు బానిసలుగా మారిన వారు సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి వారి వల్ల సమాజానికే కాకుండా, మనకు కూడా హాని జరిగే అవకాశం ఉంటుందన్నారు. డిచ్‌పల్లిలో ఇటీవలే జరిగిన ట్రిపుల్ మర్డర్ సంఘటనను ఈ సందర్భంగా కలెక్టర్ ఉటంకించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి గ్రామగ్రామాన విస్తృత చర్చ చేపడుతూ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా గ్రామగ్రామాన అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ మత్తు పదార్థాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎవరైనా గంజాయి సాగు చేసిన, మత్తు పదార్థాలు అమ్మినా, వాటిని వాడినా తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు ఈ కమిటీ నిర్భయంగా సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగించే వారిని స్థానిక ప్రజలే నిలదీసే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సర్పంచ్‌లు, ఎంపిపిలు, జెడ్‌పీటీసిలు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులను భాగస్వాములు చేస్తూ ఉద్యమంలా ముందుకు వెళ్తే నూటికి నూరు శాతం ఫలితాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ, సమాజానికి ఎంతో చేటు చేస్తున్న మత్తు పదార్థాల విక్రేతలు, స్మగ్లర్లను వారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలను తీసుకోవడాన్ని స్టేటస్‌గా భావిస్తూ, క్రమంగా ఈ రుగ్మతకు బానిసలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత కుటుంబాలకు చెందిన కొంతమంది విద్యార్థులు కూడా మత్తు వ్యసనానికి లోనవుతూ తల్లితండ్రులను వేదనకు గురి చేస్తున్నారని అన్నారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం తన సిబ్బంది సహకారంతో చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం, గంజాయి సాగు వంటి వాటి గురించి నేరుగా తనకు వాట్స్ అప్ ద్వారా సమాచారం అందించవచ్చని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, సమాచారం ఇచ్చిన వారికి పోలీస్ శాఖ తరపున తగిన పారితోషికం కూడా అందజేస్తామని పోలీస్ కమిషనర్ నాగరాజు ఈ సందర్భంగా ప్రకటించారు.
మత్తు పదార్థాల నిర్మూలనను తమ కర్తవ్యంగా భావిస్తూ ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే తాము ఉక్కుపాదం మోపి ఈ రుగ్మతను పూర్తిగా పారద్రోలగలుగుతామని అన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచాలని, వారి ప్రవర్తన దారి తప్పుతున్నట్టు గమనిస్తే వెంటనే వారికి చేదు వ్యసనాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.
మత్తు పదార్థాలు నియంత్రణ పోరాటంలో వివిధ శాఖలతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా భాగస్వాములు చేస్తూ పోలీస్ శాఖ తరపున గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో నగర మేయర్ నీతూకిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్, ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, డీసీపీలు అరవిందబాబు, ఉషా, డీటీసీ వెంకటరమణ, డాక్టర్ విశాల్‌తో పాటు పోలీస్, ఎక్సయిజ్, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులు, సంస్థల ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు.