నిజామాబాద్, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున పనులు వేగవంతంగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశిత గడువులోపు పూర్తి కానీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, ఈ విషయాన్ని గుతేదార్లు దృష్టిలో పెట్టుకుని ప్రజోపయోగ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు.
బోధన్ మున్సిపల్ పట్టణంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో గల పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠ ధామాలు తదితర పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలు చక్కగా పెంచుతుండడాన్ని చూసి నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. మరో నాలుగు నెలలు ఇదే తరహాలో కష్టపడితే మొక్కలన్నీ బ్రతుకుతాయని, తద్వారా హరితహారం లక్ష్య సాధనకు ఇది తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు.
పనుల పరిశీలన అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతితో కలిసి ఆమె ఛాంబర్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సంబంధిత అధికారులు, గుత్తేదార్లు, వివిధ వార్డుల కౌన్సిలర్లతో సమీక్ష జరిపారు. ఒక్కో పని వారీగా వివరాలను ఆరా తీస్తూ, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయమై నిర్దిష్ట గడువులు విధించారు. నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అయినందున నిర్విరామంగా పనులు జరిపిస్తూ గడువుకు ముందే పూర్తి చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు.
రూ. 20 లక్షల లోపు విలువ కలిగిన పనులను మార్చి 15 వ తేదీ లోపు పూర్తి చేయాలని, అంతకంటే ఎక్కువ 50 లక్షల లోపు విలువ కలిగిన పనులను ఏప్రిల్ 31 వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. మిగతా పనులు సైతం మే 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానంగా వైకుంఠ ధామాల నిర్మాణాల పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఈ పనులను ప్రగతిని కలెక్టరేట్ నుండి వారవారం తానే స్వయంగా సమీక్షిస్తానని పేర్కొన్నారు. పనులను చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తేవచ్చని, వాటిని పరిష్కరించేందుకు తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు.
ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే రెవెన్యూ అధికారులను పురమాయించి ఇసుక నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థల వివాదాలు వంటి వాటిని కూడా ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని, ఒక్క రోజు కూడా పనులు నిలిచిపోకుండా నిర్విరామంగా కొనసాగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగకరంగా నిలిచే పనులను సకాలంలో పూర్తి చేసే విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిర్ణీత వ్యవధిలో పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరిపితే తప్పనిసరిగా పనులు సకాలంలో పూర్తవుతాయని అన్నారు. బిల్లుల చెల్లింపుల కోసం ఎలాంటి ఇబ్బంది లేదని, సకాలంలో సక్రమంగా పనులు పూర్తయిన వాటికి వెంటదివెంట బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారుల పనితీరును సమీక్షిస్తూ, పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. బోధన్ బల్దియాలో ప్రతి రోజు సుమారు పది లక్షలకు పైగా పన్నులు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రెండు నుండి మూడు లక్షలు మాత్రమే వసూలు చేస్తున్నారని అన్నారు.
ఇలా అయితే అభివృద్ధి పనులకు నిధులు ఎలా సమకూరుతాయని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరు నాటికి వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. అదేవిధంగా మున్సిపల్ ఖాళీ స్థలాలను గుర్తిస్తూ వాటిని పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు, అనధికారిక లే అవుట్లు కలిగిన వెంచర్లను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.
స్థానిక కౌన్సిలర్లు పలు సమస్యలను ప్రస్తావించగా, వాటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశానికి ముందు కలెక్టర్ బోధన్ పట్టణము లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను, మధుమలాంచ డిగ్రీ కళాశాలను పరిశీలించి సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం, అవసరమైన నిధుల మంజూరుకై ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్దీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జీ.రామలింగం తదితరులు పాల్గొన్నారు.