నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుస్తకాలు అందించే జ్ఞానం జీవితాన్ని గొప్పగా నడిపిస్తాయని, పుస్తక పఠనం ప్రపంచంలోనే అత్యంత మంచి అభిరుచి అని ప్రముఖ సమాజ సేవకుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా అన్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచ పుస్తక వితరణ దినోత్సవం సందర్భంగా హరిద రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రచయితల వల్ల మార్గనిర్దేశనం జరుగుతుందని పాఠకుల వల్ల ఆచరణ జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ ధగధగలాడే విద్యుద్దీపాలను సూర్యుడు తలదన్నినట్టు సాంకేతిక యుగంలో కూడా పుస్తకం ప్రకాశిస్తూనే ఉంటుందని అన్నారు.
తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి దారిచూపే స్నేహితులని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన కవులు రచయితలు పుస్తకాలను బహుకరించారు. పుస్తకాలను తమ ఆత్మీయులకు వివిధ సందర్భాలలో కానుకలుగా ప్రదానం చేసే సంస్కృతి కొనసాగాలని నినదించారు. ఎవరి పుట్టినరోజు అయిన వారికి భగవద్గీతను బహూకరించే మంచాల జ్ఞానేంద్ర గుప్తాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొయ్యాడ శంకర్, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఎలగందుల లింబాద్రి, మద్దుకూరి సాయిబాబు, నవీన్, మల్లవరపు చిన్నయ్య పాల్గొన్నారు.