వర్ని, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్, పైడిమల్, నంకోల్ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల ఏర్పాటు కోసం 119.41కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పనులకు మంత్రి కేటీఆర్ తన చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సిద్దాపూర్‌ను సందర్శించి మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. హెలిపాడ్, శంకుస్థాపన శిలాఫలకం, విఐపి గ్యాలరీ, సభావేదిక, రిజర్వాయర్ నిర్మాణ స్థలాలను సందర్శించి అక్కడ కొనసాగుతున్న ఏర్పాట్లు పరిశీలించి సంబంధిత అధికారులు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. భద్రతా పరమైన అంశాలపై పోలీస్ కమిషనర్ నాగరాజు పోలీసు అధికారులకు బాధ్యతలు పురమాయించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.