డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం డైరెక్టర్ డా. కె. అపర్ణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘జండర్ ఈక్వాలిటీ – ఇష్యూస్ అండ్ చాలెంజెస్’’ (జండర్ సమానత్వం – సమస్యలు, సవాళ్లు) అనే అంశంపై వెబినార్ నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్ విభాగం విశ్రాంతాచార్యులు, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య తోటా జ్యోతీ రాణి విచ్చేసి మహిళల సమానత్వం – సమస్యలు, సవాళ్లను గూర్చి కూలంకషంగా ప్రసంగించారు. వరంగల్ నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి ‘‘స్త్రీ సంఘటన’’ అనే పత్రికను నడుపుతూ ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న జండర్ వివక్ష సర్వేలను అవగాహన చేసుకొని నేటి మహిళల పరిస్థితిని తెలియజేశారు.
ఎన్ని సంవత్సరాల నుంచి మహిళా సాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనన్నారు. ఇది కోవిద్ – 19 కాలంలో మరీ ఎక్కువగా మహిళల మీద వివక్ష అధికమైంది. 1975 నుంచి 85 వరకు సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దోత్సవాలను నిర్వహిస్తూ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధింపబడడం కోసం ప్రయత్నం చేసిందన్నారు.
స్వేచ్చా, సమానత్వం సాధించాలనే నినాదం ఏర్పరిచింది, కాని దాని ద్వారా కూడా స్త్రీల సమానత్వంలో పరిణామం కలుగలేదని, అందులో భాగంగా భారతదేశంలో 1977 లో టువర్డ్స్ ఈక్వలిటీ రిపోర్ట్ మహిళలందరు అనేక సమస్యలతో పోరాడుతున్నారని తెలిపిందన్నారు. 1985 లో చైనా మహిళా ఉద్యమకారులందరు సమావేశమై ఐక్య రాజ్య సమితి దశాబ్దోత్సవాల నివేదికను అధ్యయనం చేశారు, కాని ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ – 25 నుంచి డిసెంబర్ 10 వ తేదీ వరకు మహిళా చైతన్య దినోత్సవాలు జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక, సామాజిక సంస్థలు ప్రణాళికలు వేసి సర్వేలు నిర్వహిస్తున్నాయన్నరు. కోవిద్ – 19 మహమ్మారి కాలంలో ప్రపంచం మొత్తం మీద 11 మిలియన్ బాలికలు విద్యావకాశాలను కోల్పోయారన్నారు. ఆడపిల్లలు అందం మీద కన్నా ఆరోగ్యం, మానవీయత, సమిష్టి చైతన్యం కల్గిఉండాలన్నారు. నిర్బయ, దిశా సంఘటనలు, అందాల పోటీలు, కాస్మోటిక్స్ ప్రభావం, వ్యాపార ప్రకటణల దుష్ప్రభావం వంటి అనేక అంశాలపై చర్చ కొనసాగించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్ రెడ్డి, డా. వి. త్రివేణి, డా. శాంతాబాయి, మహిళా విద్యార్థులు పాల్గొన్నారు.