కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు.
పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. దళిత బంధు పథకానికి నియోజకవర్గానికి ఒకరిని రిసోర్స్ పర్సన్లను నియమించాలని కోరారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల వివరాలను అధికారులు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 18 వరకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు.
గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డిఓ వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఎస్‌సి కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.