కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల అలాట్మెంట్‌లో టిఎన్జిఓఎస్ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగుల ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు. పోరాటాల నుంచి పుట్టిన సంఘమే టిఎన్‌జివోస్ అని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలను అడగకుండానే పరిష్కారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో టిఎన్జిఓ ఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు.
ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, మాజీ జిల్లా అధ్యక్షుడు దయానంద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్, ప్రతినిధులు పాల్గొన్నారు.