నిజామాబాద్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద గల జిల్లా జైలులో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జైళ్ల శాఖ డీఐజి డాక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తదితరులు హాజరై మొక్కలు నాటారు.
అనంతరం జైలు ఆవరణలోని సువిశాలమైన ఖాళీ ప్రదేశంలో నర్సరీలలో పెంచుతున్న వివిధ రకాల సుమారు రెండు లక్షల మొక్కలను కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలించారు. నర్సరీల నిర్వహణ ప్రణాళికాబద్ధంగా ఉంటూ, మొక్కలన్నీ ఎంతో బలంగా, ఏపుగా పెరుగుతుండడాన్ని చూసిన కలెక్టర్ జిల్లా జైలు అధికారులను అభినందించారు. గడిచిన రెండు సంవత్సరాల నుండి నర్సరీలలో మొక్కల పెంపకం చేపడుతున్నామని జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
జైలు ప్రదేశంలో ఐదు లక్షల వరకు కూడా మొక్కలు పెంచేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. దీంతో వచ్చే ఏడాది నిజామాబాద్ నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీల పరిధిలో నాటాల్సిన మొక్కలను జిల్లా జైలు నర్సరీల్లో పెంచేలా బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జైలర్ రాజశేఖర్, ప్రకాష్, జైలు సిబ్బందితో పాటు ఖైదీలు పాల్గొని మొక్కలు నాటారు.