డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణం డిచ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న సైన్స్ బిల్డింగ్ పనులను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ఎ. ఇ. వినోద్ కుమార్ ఉన్నారు.
తెలంగాణ స్టేట్ ఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ అండ్ కార్పోరేషన్ (టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి) ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. మొత్తం 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమవుతున్న సైన్స్ బిల్డింగ్‌కు రూసా నిధుల నుంచి 10 కోట్లు వెచ్చించనున్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించాలని, దీర్ఘ కాలం మన్నిక కలిగి ఉండేటట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి సిబ్బందిని కోరారు.
హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన వీసీ
అదే సందర్భంలో వీసీ, రిజిస్ట్రార్‌లు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం (హెల్త్ సెంటర్) ను పరిశీలించారు. త్వరలో ప్రారంభించబోతున్న హెల్త్ సెంటర్ లో ఫర్నీచర్, పడకలు, వైద్య పరికరాలు తదితర సామాగ్రిని సరి చూసుకున్నారు. ఇతర అవసరాల కోసం ఎఇ విదోక్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
కళాశాలలోని బోధనా తరగతులను తనిఖీ చేసిన వీసీ
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలోని తరగతుల్లో జరుగుతున్న బోధనలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్, లా కళాశాలలను సందర్శించారు. మ్యాథమెటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లా విభాగాలకు వెళ్లి, తరగతి గదుల్లో జరుగుతున్న బోధనలను పరిశీలించారు. ఆయా విభాగాల పాఠ్యప్రణాళికలను గూర్చి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి వారికి అభిరుచి, ఆసక్తి గల పాఠ్యాంశాల్లోని విశేషాంశాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. కోవిద్ – 19 తర్వాత పునరుజ్జీవనంతో తరగతులు కళ కళ లాడుతున్నందుకు వీసీ సంతోషం వ్యక్తం చేశారు.