కామరెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి, మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
జిల్లాలో1011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. మొదటి విడతలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 129, జుక్కల్ నియోజకవర్గం లో99, కామారెడ్డి నియోజకవర్గం లో84, బాన్స్వాడ నియోజకవర్గంలో 39 పాఠశాలకు మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. రెండో విడత, మూడో విడత మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మిగతా పాఠశాలను విడతలవారీగా ఎంపిక చేస్తామని చెప్పారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలన్నారు.
దాతలు రూపాయలు 10 లక్షల విరాళం అందిస్తే ఆ తరగతి గదికి వారి పేరు పెట్టుకోవచ్చని సూచించారు. ప్రాథమిక పాఠశాలకు రూ. 25 లక్షలు విరాళం అందిస్తే వారి పేరు పెట్టాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలకు కోటి రూపాయల పైన విరాళాలు అందించిన దాత సూచించిన పేర్లను పెట్టుకోవచ్చని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు తమ తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. ఎంపికైన బడులలో నీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, విద్యుదీకరణ, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, అదనపు గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్ల్ , డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమకూరుస్తుందని చెప్పారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పనులను పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా కొనసాగించవలసి ఉన్నందున ఎస్‌ఎంసి కమిటీలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ఎస్‌ఎంసి కమిటీల భాగస్వాములై నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చూడాలని తెలిపారు. నిధుల వెచ్చింపు పై సోషల్ ఆడిట్ ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
జెడ్పి చైర్ పర్సన్ శోభ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేవిధంగా చూడాలని కోరారు. దాతల సహకారంతో బడులలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాలకు చెందిన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని అనుకూలంగా మలుచుకోవాలని పేర్కొన్నారు.
సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, ఆర్‌డిఓ రాజా గౌడ్, జెడ్‌పిటిసి సభ్యులు, ఎంపీపీలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.