మన ఊరు – మన బడి అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు సమకూరుతాయని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావుతో కలిసి మన ఊరు – మన బడి కార్యక్రమంపై కలెక్టర్‌ ఆయా మండలాల జడ్పిటీసీలు, ఎంపిపిలతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అమలు తీరుతెన్నుల గురించి వారికి అవగాహన కల్పించారు. విద్యా రంగం పటిష్టంగా ఉన్న సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందన్న మహనీయుల సూక్తి ముమ్మాటికీ వాస్తవం అని కలెక్టర్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సర్కారీ బడులకు మహర్దశ కల్పించాలనే సదాశయంతో మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

మూడు దశల్లో అమలయ్యే ఈ కార్యక్రమంలో మొదటి విడతగా 35 శాతం పాఠశాలలను విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సమాన నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. తొలి దఫాలో ఎంపిక చేసిన 407 బడులలో నీటి వసతితో కూడిన టాయిలెట్స్‌, విద్యుద్దీకరణ, రక్షిత మంచినీరు, ఫర్నిచర్‌, పెయింటింగ్‌, చిన్నా పెద్ద మరమ్మతు పనులు, గ్రీన్‌ చాక్‌ బోర్డు ఏర్పాటు, ప్రహరీ గోడ, కిచెన్‌ షెడ్‌, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్‌, డిజిటల్‌ విద్యా బోధనకు అవసరమైన వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లోనే నిధులను సమకూరుస్తుందని తెలిపారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పనులను పాఠశాల యాజమాన్య కమిటీ ద్వారా కొనసాగించాల్సి ఉన్నందున, ప్రతి బడిలోనూ ఎస్‌ఎంసి కమిటీలు చురుకైన పాత్ర పోషించేలా సన్నద్ధం అయి ఉండాలన్నారు. సోమవారం నుండి ప్రతి పాఠశాలలోనూ యాజమాన్య కమిటీల స్థితిగతులను క్షుణ్ణంగా పర్యవేక్షించుకోవాలని, ఎక్కడైనా ఈ కమిటీలు లేనిపక్షంలో తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జడ్పిటీసీలు, ఎంపిపిలు ఎస్‌ఎంసి కమిటీలలో భాగస్వాములై మన ఊరు – మన బడి కింద చేపట్టే పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్‌ కోరారు. పాఠశాల యాజమాన్య కమిటీకి ముందుగానే నిధులు కేటాయించబడతాయని, ఎస్‌ఎంసి కమిటీ చైర్మన్‌తో పాటు, స్కూల్‌ హెచ్‌ఎం, స్థానిక సర్పంచ్‌, వర్క్‌ ఏజెన్సీగా ఎంపిక చేసిన ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఏ.ఈ లు నలుగురి సంతకాలతో కూడిన చెక్కుల ద్వారా బిల్లుల చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు.

నిధుల వెచ్చింపుపై సోషల్‌ ఆడిట్‌ ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అయితే పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తూ చేపట్టే కీలక పనులను టెండర్‌ పద్ధతిన నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ పది పాఠశాలలకు ఒక నోడల్‌ ఆఫీసర్‌గా జిల్లా అధికారులను నియమిస్తామని అన్నారు. అయితే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఆయా బడులలో అవసరమైన మౌలిక వసతులను గుర్తిస్తూ, పనులు సకాలంలో సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ జరిపితేనే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాలకు చెందిన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ధేందుకు ఈ కార్యక్రమాన్ని అనుకూలంగా మల్చుకుని ప్రజాప్రతినిధులు అంకిత భావం తో పాల్గొనాలని కోరారు. కాగా, ప్రభుత్వ బడులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు గాను దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణాలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్నారని జెడ్‌ పీ చైర్మన్‌ విఠల్‌ రావు ప్రశంసించారు.

జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున ఆయన సి.ఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, జెడ్‌పీ సీఈఓ గోవింద్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, ఆయా మండలాల జడ్పిటీసీలు, ఎంపిపిలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆయా శాఖల ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »