డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాగా శనివారం టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వర్సెస్ నిశిత డిగ్రీ కళాశాల జట్టుల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. ఇందులో టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనితర సాధ్యమైన (అమేజింగ్) ప్రతిభను కనబరిచి నిశితా డిగ్రీ కాలేజ్ జట్టుపై గెలిచి మొదటి స్థానాన్ని సాధించింది. నిశితా డిగ్రీ కాలేజ్ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది.
మధ్యాహ్నం సమాపనోత్సవాలకు రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన జట్టులకు బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా ట్రోపీతో పాటు 10 వేల నగదు, ద్వితీయ బహుమతిగా ట్రోపీతో పాటు 5 వేల నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోవిద్ – 19 తర్వాత పునరుజ్జీవ కాంతులతో ఆట పాటలతో, చదువు సంధ్యలతో క్యాంపస్ కళకళ లాడుతుండడం ఆనందంగా ఉందన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్ వెలిసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను పదును పెట్టుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. కో – కరికులం ఆక్టివిటీస్‌లో పాల్గొని తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు.
కార్యక్రమంలో పిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) డా. బి. ఆర్. నేతా, విద్యార్థి సంఘనాయకులు డా. శ్రీనివాస్ గౌడ్, యెండల ప్రదీప్, పుప్పాల రవి, పులి జైపాల్, డా. రవీందర్ నాయక్, పీఆర్‌ఓ డా. త్రివేణి తదితరులు పాల్గొన్నారు.