మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇకపై కార్పొరేట్‌ స్థాయి వసతులు సమకూరనున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ఇందుకు దోహదపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చి విద్యా బోధన మరింతగా మెరుగుపడబోతోందని అన్నారు.

మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలు తీరు, విధివిధానాల గురించి శనివారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక సర్పంచ్‌లు, ఎంఈవోలు, ఎంపీడీవో లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నేటి సమాజంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యం పైనే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రస్తుతం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసుకుంటే విద్యపై ప్రజలు వెచ్చిస్తున్న డబ్బులను వారికి ఆదా చేసినట్లు అవుతుందన్నారు.

అంతేకాకుండా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్యను అభ్యసించి చక్కటి భవిష్యత్తును ఏర్పర్చుకుంటారని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాల నిర్వహణ కమిటీలు, హెచ్‌ఎం లతో పాటు గ్రామ స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు అందరు మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగస్వామ్యమై క్రియాశీలక పాత్ర పోషిస్తూ, దీని విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు. దీని ఔన్నత్యాన్ని గుర్తెరిగి సానుకూల దృక్పధంతో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని హితవు పలికారు.

తొలి విడతగా జిల్లాలో 407 ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ఎంపిక చేయడం జరిగిందని, ఈ బడులలో అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే జిల్లాకు సుమారు 150 నుండి 160 కోట్ల రూపాయల వరకు నిధులను మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంసి కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో అవసరమున్న పనులను గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా పాఠశాల నిర్వహణ కమిటీలు లేని పక్షంలో వాటిని వెంటనే ఏర్పాటు చేసుకోవాలని, సోమవారం మొత్తం 407 పాఠశాలల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు.

వచ్చే గురువారం నాటికి ఎస్‌ఎంసి కమిటీ సభ్యులకు శిక్షణ పూర్తి చేసుకోవాలని, పూర్వ విద్యార్థులు కమిటీని ఏర్పాటు చేసుకుని, నిధుల వెచ్చింపు కోసం రెండు వేర్వేరు బ్యాంకు జాయింట్‌ అకౌంట్లను తెరవాలని కలెక్టర్‌ సూచించారు. మన ఊరు – మన బడి కింద ప్రభుత్వం కేటాయించే నిధులతో 12 రకాల పనులు చేపట్టాలని, పూర్వ విద్యార్థులు కమిటీ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాల నిధులతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని వివరించారు. ఏదైనా పాఠశాలకు దాతలు రెండు లక్షల రూపాయల విరాళం అందిస్తే పాఠశాల నిర్వహణ కమిటీలో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు.

పది లక్షల విరాళం అందిస్తే తరగతి గదికి, కోటి రూపాయలు ఇస్తే పాఠశాలకు వారు సూచించే పేరు పెడతామన్నారు. జిల్లాలో ఇప్పటికే సర్పంచ్‌లు, గ్రామాభివృద్ధి కమిటీల తోడ్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు చక్కగా కొనసాగుతున్నాయని, మన ఊరు – మన బడి కార్యక్రమంలోనూ వారి సహకారం తీసుకుని సర్కారీ బడులను బలోపేతం చేస్తామన్నారు. కాగా, మన ఊరు – మన బడి కింద వెచ్చించే నిధులు, చేపట్టే ప్రతి పనిపై సామాజిక తనిఖీ తప్పనిసరిగా జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఎంపిక చేసిన బడులలో అవసరమైన పనులను మాత్రమే గుర్తిస్తూ, నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. డిజిటల్‌ బోధనకు అవసరమైన సామాగ్రి, ఫర్నిచర్‌, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌ కు అవసరమైన సామాగ్రిని స్థానికంగా కొనుగోలు చేయకూడదని ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ఏంటో ప్రయోజనకరంగా నిలిచే మన ఊరు – మన బడి కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ చక్కటి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు.

ఈ సందర్భంగా మన ఊరు – మన బడి అమలు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్య శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, జెడ్‌పీ సీఈఓ గోవింద్‌, డీఆర్‌డీఓ చందర్‌, ఆయా మండలాల ఎంఈవోలు, సర్పంచ్‌ ఎంపీడీవోలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల ఏఈలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »