నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.
మొత్తం 56 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు వెంటదివెంట పరిశీలిస్తూ, తక్షణమే పరిష్కారం చేసే దిశగా చొరవ చూపాలని అన్నారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్నిజిల్లాలో విజయవంతం చేసి సత్ఫలితాలు సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన 407 పాఠశాలల్లోనూ నిర్వహణ కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటై ఉండాలని, పూర్వ విద్యార్థుల కమిటీలను కూడా నియమించుకోవాలని, బ్యాంకు అకౌంట్లు తెరవాలని, పాఠశాల నిర్వహణ కమిటీల ప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై చేపట్టాల్సిన పనులను గుర్తించి మూడు రోజుల్లోపు జాబితాను రూపొందించుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల ప్రగతిపై చర్చిస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. పనులన్నీ గ్రౌండిరగ్ జరిగి, సకాలంలో అవి పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదేనని కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.