పంట రుణాల పంపిణీలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున సేద్యపు రంగానికి విరివిగా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాల పంపిణీలో ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా రంగాలకు బ్యాంకుల ద్వారా అందించిన రుణాలు, కేటాయించిన రుణ వితరణ లక్ష్యాన్ని ఏ మేరకు సాధించారు తదితర అంశాలను కలెక్టర్‌ ఒక్కో బ్యాంకు వారీగా సమీక్షించారు. ప్రస్తుత 2021 – 2022 ఆర్ధిక సంవత్సరంలో ఖరీఫ్‌ సీజన్‌లో 2129 కోట్ల రూపాయలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా, 1682.91 కోట్ల రూపాయల రుణాలను అందించి 79.05 శాతం లక్ష్యాన్ని సాధించారని కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

గతేడాది ఖరీఫ్‌ లో కేవలం 64.04 శాతం మాత్రమే రుణ పంపిణి జరిగిందని, ఈసారి ఇప్పటికే 80 శాతం రుణ పంపిణి పూర్తయ్యిందని అన్నారు. కేటాయించిన లక్ష్యానికి మించి పంట రుణాలు అందించిన ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, ధనలక్ష్మి బ్యాంకు తదితర బ్యాంకుల పనితీరును కలెక్టర్‌ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించారు. ఆర్ధిక సంవత్సరం ముగిసేందుకు మరికొద్ది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున పంట రుణాల వితరణను వేగవంతం చేయాలని హితవు పలికారు. కాగా, పంట రుణాల పంపిణీ లక్ష్య సాధనలో పూర్తిగా వెనుకంజలో ఉండిపోయిన బ్యాంకర్ల పనితీరు పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంతో కీలకమైన సేద్యపు రంగానికి రుణాలు అందించే విషయంలో కొన్ని బ్యాంకులు పూర్తిగా అలసత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ఆర్ధిక తోడ్పాటును అందించి ప్రోత్సహించినప్పుడే చిన్న, సన్నకారు రైతులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్ధిక ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పంపిణీ చేసిన రుణాలను తిరిగి రాబట్టుకునే విషయంలో బ్యాంకర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నామని, బకాయిల వసూళ్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ ను కూడా నిర్వహించుకోవచ్చని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మొండి బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకర్లు చేపట్టే చర్యలకు జిల్లా యంత్రాంగం కూడా మద్దతుగా నిలుస్తుందని బ్యాంకర్లకు భరోసా కల్పించారు.

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోపు రుణ మొత్తాలను తిరిగి చెల్లించాలని ఈ సందర్భంగా రుణగ్రహీతలు కలెక్టర్‌ హితవు పలికారు. అప్పుడే బ్యాంకర్ల నమ్మకాన్ని చూరగొని మరింత ఎక్కువ మొత్తంలో రుణాలు పొందేందుకు వీలుంటుందన్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుత రబీ సీజన్‌లో 1421.68 కోట్ల రూపాయలను పంట రుణాల రూపంలో అందించాలని నిర్దేశించగా, ఇప్పటివరకు 543.03 కోట్ల రూపాయలను పంపిణి చేసి 38.20 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగారని అన్నారు. ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు కనీసం 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా విరివిగా పంట రుణాలు పంపిణి చేయాలని కలెక్టర్‌ సూచించారు. మార్చి మూడవ వారంలో తాను ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశమై వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాల పంపిణీ అంశాలపై బ్యాంకుల వారీగా సమీక్ష జరుపుతానని, ఆలోపే పూర్తి స్థాయిలో రుణాలు పంపిణి అయ్యేలా చొరవ చూపాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

కాగా, విద్యా సంబంధిత రుణాల పంపిణీకి కూడా చొరవ చూపాలని కలెక్టర్‌ హితవు పలికారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ఆర్ధిక తోడ్పాటును అందించి వారు మరింత ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు బ్యాంకర్లు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం పది లక్షల రూపాయలను సమకూరుస్తుందని, అయితే అంతకంటే ఎక్కువ విలువ చేసే యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పక్షంలో వారికి స్టాండ్‌ అప్‌ ఇండియా పథకం కింద రుణ సహాయం అందించే అవకాశాన్ని బ్యాంకర్లు పరిశీలించాలని కలెక్టర్‌ ప్రతిపాదించారు.

అదేవిధంగా మన ఊరు – మన బడి కార్యక్రం అమలు కోసం అవసరమైన రెండు రకాల బ్యాంకు అకౌంట్లను పాఠశాల నిర్వహణ కమిటీలు తెరిచేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ శ్రీనివాస రావు, ఆర్‌బిఐ ప్రతినిధి రాజేంద్రప్రసాద్‌, నాబార్డ్‌ డీడీఎం నాగేష్‌, డీఆర్‌డీఓ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »