నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో, పడిగెల్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి యావత్తు దేశం అబ్బుర పడుతోందని అన్నారు. మహారాష్ట్రలో ని 14 గ్రామాలకు చెందిన సర్పంచులు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందించారని గుర్తు చేశారు. చివరకు కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ఎమ్మెల్యే కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేకపోతే తన నియోజకవర్గంను తెలంగాణలో కలపాలని కర్ణాటక ప్రభుత్వంను డిమాండ్ చేశారంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ను అర్ధం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాళేశ్వరం జలకళను చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. ఇదే కాకుండా కోటి కుటుంబాలకు ఇంటింటికీ కుళాయిలు అమర్చి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. అతి తక్కువ జనాభా కలిగి ఉండే అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని దానిని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ లో ఆచరణలో సాధ్యం చేసి చూపిందన్నారు. అందుకే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పరిశీలన కోసం ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధుల బృందాలు తెలంగాణలో పర్యటిస్తూ, ఇక్కడి ప్రగతిని చూసి ఆశ్చర్య చకితులవుతున్నారని అన్నారు.
వాస్తవంగానే దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, సేద్యానికి ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి అనేకానేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. అందుకే తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలనే ఆకాంక్షను ప్రజలు బలంగా వెలిబుచ్చుతున్నారని అన్నారు.
ఈ వాస్తవాలను గుర్తించి ప్రజలు తమ ప్రభుత్వానికి బాసటగా నిలిచి తెలంగాణ ను ప్రగతి లో మరింతగా పరుగులు పెట్టించేందుకు దోహదపడాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
భూ పోరాటానికి నాందీగా నిలిచిన చాకలి ఐలమ్మ
వీరనారి చాకలి ఐలమ్మ దొరల ఆధిపత్యంను ఎదురిస్తూ కొనసాగించిన పోరాటం భూ పోరాటానికి నాందీగా నిలిచిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి వేముల మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, ఐలమ్మ వీరత్వాన్ని ఎంతగానో పొగిడారు. నాటి దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగించిన ధీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
బాంఛన్ కాల్మొక్కుతా అనే స్థితిలో ఉన్న పీడిత సమాజం చేతుల్లో బందూకులు పట్టించి దొరలను గడగడలాడిరచిన ఘనత ఐలమ్మదని పేర్కొన్నారు. దొరల దాష్టీకాలపై సివంగిలా గర్జించిన ఐలమ్మ నడుముకు కొంగుచుడితే, దొరతనం తోక ముడిచిందన్నారు. దొర ఇంట్లో వెట్టి చాకిరి చేసే నాటి సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ, ఐలమ్మ 40 ఎకరాల భూమిని కౌలు తీసుకుని పంట పండిరచిందన్నారు.
దీనిని జీర్ణించుకోలేకపోయిన దొరలు ఐలమ్మ పంటను బలవంతంగా కోసుకుని తేవాలంటూ వంద మంది అనుచరులను పంపిస్తే, ఐలమ్మ తన నలుగురు కొడుకులతో కలిసి వంద మందిని తరిమి తరిమి తన వీరత్వాన్ని చాటిందని మంత్రి కొనియాడారు. ఆమె పోరాట స్పూర్తితో కమ్యూనిస్టులు భూ పోరాటానికి నాంది పలికారని, 90 ఎకరాల భూమిని దొరల నుండి స్వాధీనం చేసుకుని పేదలకు పంచారని అన్నారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.