అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై డివిజన్‌ల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు.

బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే, పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. లేనిపక్షంలో కేసులు రోజుల తరబడి పెండిరగ్‌ లో ఉండిపోవడం వల్ల బాధితులు నిరుత్సాహానికి లోనవుతారని అన్నారు. ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి తగిన న్యాయం జరిపించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

అట్రాసిటీ కేసుల్లో వాస్తవంగానే నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. భూ సమస్యలు, భూ తగాదాలతో ముడిపడి ఉన్న కేసులకు సంబంధించి రెవిన్యూ అధికారుల నుండి నివేదికలు తెప్పించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు.

పెండిరగ్‌ ట్రయల్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ సూచించారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 123, బోధన్‌ డివిజన్‌ లో 30, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 54 పెండిరగ్‌ ట్రయల్‌ కేసులు ఉన్నాయని, తదుపరి నిర్వహించే విజిలెన్సు మానిటరింగ్‌ కమిటీ సమావేశం నాటికి వీటి పరిష్కారం విషయంలో పురోగతి ఉండాలన్నారు. కాగా, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై ఆంక్షలు విధిస్తున్నాయని సభ్యులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడే వీడీసీ లను ప్రోత్సహిస్తామని, కలిసికట్టుగా ప్రగతి పనులు చేసుకోవడంలో తప్పు లేదన్నారు. అలా కాకుండా తాము చెప్పిందే చెల్లుబాటు కావాలి అనే రీతిలో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే వీడీసీలపైనా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అవసరమైతే పీ.డీ యాక్టులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కమిటీ సభ్యులు బాధితులకు వారు సరైన రీతిలో సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలా కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు.

పోలీస్‌ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డి శశికళ, ఏసీపీలు వెంకటేశ్వర్‌, రామారావు, రఘు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »