డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీన నిర్వహించ తలపెట్టిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పాపులర్ సైన్స్ లెక్చర్స్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నం అస్సాం రాష్ట్రంలోని జోర్హార్ నుంచి నీస్ట్ లాబోరేటరీ జాతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డా. గరికపాటి నరహరి శాస్త్రి ప్రధాన వక్తగా విచ్చేసి ‘‘ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్సీ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఫార్మసీ’’ అనే అంశంపై ప్రసంగించారు.
నేటి ప్రపంచీకరణ కాలంలో సరళీకృత ఆర్థిక విధి విధానాలు కొనసాగుతున్న సందర్భంలో రసాయన, ఔషద రంగాలలో కేత్రిమ మేధ పాత్ర అవసరం ఏ రీతిగా ఉండాలో ప్రజోపయోగ ప్రయోగాలు ఎలాంటివి నిర్వహించాలో సవివరంగా వివరించారు.
తదంతరం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ జాతీయ పరిశోధన సంస్థలలో తెలంగాణ యూనివర్సిటీని అనుసంధానం చేస్తూ ఈ పాపులర్ లెక్చర్ సిరీస్ ను నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. ఇది పరిశోధనా రంగంలో గొప్ప ముందడుగు అని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య నసీం, డా. వాసం చంద్రశేఖర్, డా. శిరీష బోయపాటి ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.