ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘‘నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్‌ జిల్లాలో గత ఎనిమిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధి పై,సాధించిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేశారు.

ఏడున్నర ఏండ్లుగా బీజేపీ దేశానికి శనిలా, మూడేళ్లు గా నిజామాబాద్‌ జిల్లాకు ఎంపీ అరవింద్‌ దరిద్రంలా తయారైనట్టు ఆయన మండిపడ్డారు. కేడర్‌, క్యారెక్టర్‌ లేని ఎంపీ అరవింద్‌ ఏనాడు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడలేదని, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరో పని లేదని ఆయన అన్నారు. నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 5లక్షల 2554 మందికి ఇప్పటి వరకు 1009 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని, కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్‌ ద్వారా 57230 మందికి రూ.480 కోట్లు ఇచ్చి పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లను ఒక మేనమామగా, తాతాగా జరిపించిన గొప్ప నేత కేసీఆర్‌ అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సర్కారు దవాఖానాల్లో 76301 ఉచిత ప్రసవాలు జరిగాయని, ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు కాకుండా కాపాడటమే కాకుండా రూపాయలు 12 వేలు, ఆడపిల్ల పుడితే రూపాయలు 13 వేల చొప్పున ఇచ్చామని, 76301 మందికి కేసీఆర్‌ కిట్లు అందజేసామన్నారు. ఒక్క ఆర్మూర్‌ ఆస్పత్రిలోనే 32 వేల ఉచిత ప్రసవాలు జరిగాయని, దీనికి 99 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 73 వేల గొర్రెల యూనిట్లలకు 714 కోట్లు ఇచ్చామని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

హరితహారం పథకానికి 128 కోట్లు ఖర్చు చేశామని, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపాయలు 114కోట్ల 96 లక్షలు ఖర్చు పెట్టామని, చేప పిల్లల పంపిణీకి 8 సంవత్సరాల లో 26 కోట్లు కేటాయించారన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ రివర్స్‌ పంపింగ్‌కు 230కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఆర్మూర్‌ను కొత్తగా రెవెన్యు డివిజన్‌, సబ్‌ రిజిస్టార్‌ ఏర్పాటు చేసామన్నారు. 39 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా సుమారు 25వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దీనికి 1200 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.

119 కోట్లతో పంచ గూడా వంతెన నిర్మాణం చేపట్టామని, ముంపు గ్రామాలకు 106 కోట్లతో ఇండ్లు మంజూరు చేశామని, 120 కోట్లతో సోలార్‌ ప్రాజెక్టు చేపట్టామని, భీంగల్‌ ను కొత్త మునిసిపాలిటీ గా మార్చామని, మిషన్‌ భగీరథ ద్వారా 1735 కోట్లతో 805 పనులు చేపట్టి ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ ద్వారా 17మంది లబ్దిదారులకు 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించామని, టీ-హబ్‌ నిర్మాణం ద్వారా నిజామాబాద్‌ నగరంలో 50 కోట్ల నిధులు తెచ్చామన్నారు.

పంచాయితీ రాజ్‌ శాఖ ద్వారా 460 కోట్లను ఖర్చు చేసామని, 413 కోట్ల రూపాయలతో 20 చెక్‌ డ్యామ్‌లను మంజూరు చేశామని, కులవృత్తులు చాకలి రాజకులకు 12 కోట్ల విద్యుత్‌ బిల్లులు మాఫీ చేశారన్నారు. సిడిపి, ఎస్‌డిఎఫ్‌ నిధుల కింద 450 కోట్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల అభివృద్ధి కొరకు 320 కోట్లు, ఆర్‌అండ్‌బి నిధులు 1452 కోట్లు, పంచాయతీ రాజ్‌ 960 కోట్లు, ఇరిగేషన్‌కు 701 కోట్లు… ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు రెండు రోజులు చాలవని, ఇది మా శ్వేత పత్రం అన్నారు.

దీనిని ఎంపీ అరవింద్‌కు పంపిస్తానని, ఎంపీగా అరవింద్‌ ఏం చేశాడో ప్రజలకి చెప్పాలని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు నిజాలు చెప్పడం తమ బాధ్యత అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని అమలు చేసుకుంటున్నామని, తెలంగానొస్తే ఏమొస్తదని హేళన చేసిన కొంత మంది సన్నాసులకు కళ్ల ముందు కనపడుతున్న ఈ అభివృద్దే సమాధానమన్నారు.

ఏ గ్రామంలోనూ ప్రజలు రానివ్వక పోవడంతో బెంబేలెత్తుతున్న అరవింద్‌ పిచ్చెక్కి సీఎం కేసీఆర్‌ పై,టీఆర్‌ఎస్‌పై ఆవాకులు చెవాకులు పేలుతున్నాడని, కేసీఆర్‌ రైతు బంధు, మోడీ ఏ బంధువు అని, ఎల్‌ఐసీ, రైల్వేలు, ఎయిర్‌ పోర్ట్‌లు అమ్ముతుండని, దళితులు, గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని, ప్రజలను పట్టించుకోకుండా ఓట్ల కోసం అయితే ఖలిస్తాన్‌ లేకుంటే పాకిస్థాన్‌ అని, అయితే జమ్మూకాశ్మీర్‌ లేకుంటే చైనా వాల్‌ అని, ఎన్నికలొస్తే సర్జికల్‌ స్ట్రైక్స్‌ లేకుంటే రోహింగ్యాలు అని, ఏ రొటి కాడ ఆ పాట పాడటం బిజెపికి, ప్రధాన మంత్రి మోడీ అలవాటు పడ్డారన్నారు. రాష్ట్రానికొక వేషం ప్రాంతానికొక మోసం అని, ఈ ఆరాచకానికి చరమ గీతం పాడటానికి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారన్నారు. ఫేక్‌, ఫాల్స్‌, ఫ్రాడ్‌ ఎంపీ అబద్ధాల అరవింద్‌ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నడన్నారు.

రైతులను నిలువునా ముంచిండని, ఏడు నియోజక వర్గాల ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతుండ్రని, పోలీసుల రక్షణ లేకుండా ఎంపీ తిరగలేడన్నారు. ఇక నైనా ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని, శ్వేత పత్రంపై స్పందించాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే పాలాభిషేకం చేస్తా అని జీవన్‌ రెడ్డి హితవుపలికారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »