నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన పార్లమెంట్ కార్యక్రమం గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ యువత తమ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికతో పని చెయ్యాలని, తమ కుటుంబం, గ్రామం తద్వారా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా మన ప్రణాళిక ఉండాలన్నారు. మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం ఉంటుందని, మంచి ఆరోగ్యం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని ఆ ఆలోచనాలతోనే మన భవిష్యత్ నిర్మాణం అవుతుందని, ఇదే ఫిట్ ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యమని సూచించారు.
జిల్లా టి.బి మరియు ఎయిడ్స్ నియంత్రణ అధికారి రవి గౌడ్ మాట్లాడుతూ యువతీయువకులు అందరూ టి.బి పట్ల అవగాహన కలిగి ఉండాలని మన కుటుంబసభ్యులకి కూడా ఈ అవగాహన కల్పించాలని సూచించారు. టి.బి వచ్చిన వారు తమని సంప్రదించాలని కోరారు. ఇంపాక్ట్ మొటివేషనల్ స్పీకర్ లాభిశెట్టి మహేష్ మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించడం ఎలా, మన జీవన ప్రణాళిక రూపొందించడం ఎలా, ఒక విజయవంతమైన భవిష్యత్ కోసం ఎలాంటి ఆలోచనలు చెయ్యాలి అనే విషయాల మీద అవగాహన కల్పించారు.
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాచయ్య మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగా ఆచార్యుడు గంగాధర్ యువకులకు యోగా, ప్రాణాయామం మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో యువకులకు మాక్ పార్లమెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ జూనియట్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.