నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రమను ఆయుధంగా మల్చుకుని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంతంతమాత్రంగానే సదుపాయాలూ అందుబాటులో ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేద కుటుంబాలకు చెందిన వారికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధమని ఆయన పేర్కొన్నారు.
మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన రిటైర్డ్ హెచ్‌ఎం రంగారావు దంపతులు విరాళంగా సమకూర్చిన 14 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్, కిచెన్ షెడ్లను కలెక్టర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్‌ను తిలకించిన కలెక్టర్, వారి నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్ధి దశలోనే చక్కగా చదువుకుని విద్యా రంగంలో రాణిస్తే, తమ తలరాతతో పాటు యావత్ కుటుంబం తల రాతను మార్చవచ్చని హితబోధ చేశారు. ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు దోహదపడే విద్యార్జనను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, నా వంశవృక్షం స్థితిగతులనే మార్చివేయగలననే కసితో కష్టపడి చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ వయసులో సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదువుతూ అత్యున్నత భవిష్యత్తు కోసం బంగారు బాటలు ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.
ప్రత్యేకించి బాలికలు తాము ఇంటిపని వంట పనికే పరిమితం అనే భావనను విడనాడి, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో తొలి విడతలో 407 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, వచ్చే నాలుగైదు మాసాల్లోనే అవసరమైన అన్ని హంగులు సమకూరి ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే రీతిలో మారనున్నాయని, ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే విద్యార్థులు అందుబాటులోకి వచ్చిన సదుపాయాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ చదువుల్లో ఉన్నత ప్రమాణాలను చాటాలని సూచించారు.
కాగా, తాము విధులు నిర్వర్తించిన పాఠశాలకు ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతో రిటైర్డ్ హెచ్‌ఎం రంగారావు పెద్ద మొత్తంలో విరాళాన్ని సమకూరుస్తూ భోజన శాల, వంట గదులను నిర్మింపజేయడం, మరికొందరు దాతలు బాలురు, బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కట్టించడం, ఫర్నిచర్ సమకూర్చడం ప్రశంసనీయమని కలెక్టర్ వారిని అభినందించారు. మోస్రా ఉన్నత పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు చూస్తే, మన ఊరు మన బడి కార్యక్రమం ముందుగానే ఈ పాఠశాలలో పూర్తయ్యిందని భావన కలుగుతోందన్నారు.
సాధారణంగా అనేకచోట్ల ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఫిర్యాదులు తరుచు వస్తుంటాయని, అందుకు భిన్నంగా మోస్రా పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలతో మమేకమై వారి తోడ్పాటుతో పాఠశాలకు విరాళాలను సేకరిస్తూ ప్రభుత్వ బడిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుండడం అభినందనీయమని కలెక్టర్ ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు.
ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ, మోస్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా నిలపాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన ఆయా వసతుల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున నిధులు సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్దీవో రాజేశ్వర్, బోధన్ ఏసిపి రామారావు, జెడ్‌పీటిసి భాస్కర్ రెడ్డి, ఎంపిపి ఉమా, సర్పంచ్ సుమలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీకాంతరావు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.