కామారెడ్డి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఆదివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై చిన్నారులకు చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, బస్ స్టాండ్‌లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఏదేని కారణంతో ఈ రోజు పోలియో చుక్కలు చిన్నారులకు వేయించలేకపోతే నేడు, రేపు రెండు రోజులపాటు (సోమవారం, మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఇంతకు ముందు వేయించినా సరె మరొకసారి బిడ్డకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని సూచించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు సుజాయత్ అలీ, మారుతి బాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.