కామారెడ్డి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆలయాల, పాఠశాలల అభివృద్ధికి, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి నీటి శుద్ధి ప్లాంట్‌లను ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. ఐకమత్యంగా ఉంటే దాతలు ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వస్తారని తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతి వేగంగా వెళ్లడం వల్ల అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడప వద్దని చెప్పారు. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి స్పీడ్ గన్ వితరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదాలను తగ్గించడానికి స్పీడ్ గన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి మాట్లాడుతూ తను పుట్టిన జిల్లాపై మమకారంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో తనకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలకు క్రీడా పరికరాలు వితరణ చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన గురువులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఎల్లారెడ్డికి వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. శబరిమాత ఆలయంలో దాత పైడి ఎల్లారెడ్డి ఏర్పాటుచేసిన నీటి శుద్దీకరణ ప్లాంటును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డి, సిడిసి చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్‌పి శశాంక్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.