కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
పోషకాహార లోపంతో పిల్లలు అధికంగా ఉన్న కేంద్రాలను ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, వైద్యులు, గ్రామ సంఘం మహిళలు సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, వైద్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.