నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిశీలన జరుపుతూ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 63 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు.
జిల్లా స్థాయి అధికారులు ఉదయం వేళల్లో తమతమ శాఖాపరమైన కార్యక్రమాల పరిశీలనకై క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తమ కింది స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రగతిని సమీక్షించుకోవాలని ఆదేశించారు. టూర్ ప్రోగ్రాం వివరాలను స్ప్రెడ్ షీట్లో తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు. వాస్తవ పర్యటనలతో కూడిన వివరాలను క్రమ పద్దతిలో పొందుపర్చాలని, తప్పుడు వివరాలను రాస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనల వివరాలను తాను నిశితంగా పరిశీలన జరుపుతానని కలెక్టర్ పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్నిపకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల్లో అవసరమైన పనులు మాత్రమే గుర్తించాలని అన్నారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని, అయితే ఆయా యూనిట్ల స్థాపన ద్వారా ఒనగూరే లాభ నష్టాల గురించి వారికి పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణ అక్కడక్కడా సక్రమంగా లేదని, అధికారులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకుని ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
ప్రతి సంవత్సరం విస్త ృతంగా మొక్కలు నాటుతున్నామని, అయితే వేసవి సీజన్ లో నిర్వహణ లోపాల కారణంగా చాలా చోట్ల మొక్కలు ఎండిపోయి కనుమరుగవుతున్నాయని, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్నారు. మార్చి, ఏప్రిల్, మే వరకు మూడు మాసాల పాటు ప్రతి మొక్కకు క్రమం తప్పకుండా నీరందిస్తూ వాటిని కాపాడుకునేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.