మోర్తాడ్, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవజాతి కోరిన కోర్కెలు తీర్చే దైవం మహాదేవుడి నేడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్, మెండోరా, మోర్తాడ్ మండలాలలోని ఆయా గ్రామాలలో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయా గ్రామాలలోని శివాలయాలలో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాలలోని గ్రామ అభివృద్ధి కమిటీలు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శివాలయాలకు విద్యుత్ దీపాలంకరణలు గావించారు.
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు తాగునీటి సౌకర్యం, ఉపవాసాలు ఉండే భక్తుల కొరకు వంట చేసుకుని ఉండటానికి కావలసిన సౌకర్యాలు కల్పించారు. మోర్తాడ్ మండలం వడ్యాట్, శెట్పల్లి, ధర్మోర, గాండ్లపేట్, మోర్తాడ్ గ్రామాలలో భక్తుల సౌకర్యార్థం టెంట్లు వేసి మంచినీటి సౌకర్యం తాత్కాలిక మూత్రశాలలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
మోర్తాడ్ గ్రామంలోని అతి పురాతన శివాలయం మహాశివరాత్రి పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం పార్వతి పరమేశ్వరుల కళ్యాణం గావించారు. కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామాభివృద్ధి సంఘం సభ్యులు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలే కాకుండా అదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, మెట్‌పల్లి తదితర గ్రామాల నుండి అనేక మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.