నిజామాబాద్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, పంచాయతీరాజ్ ఏ.ఈ లకు స్పష్టమైన గడువు విధించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సివిల్ వర్క్స్ ప్రగతి గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందించేందుకు వీలుగా తక్షణమే మస్టర్లు రూపొందించాలన్నారు. కాగా, ఈజీఎస్ కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పినప్పటికీ కొన్ని మండలాల అధికారులు అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వేల్పూర్, డిచ్ పల్లి, భీంగల్, బోధన్, కోటగిరి మండలాల్లో ప్రగతి చక్కగా ఉందని, మిగతా మండలాల్లో పనులు ప్రారంభించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. ప్రత్యేకించి ఎడపల్లి, నవీపేట్, మోస్రా మండలాల్లో ఈజీఎస్ పెండిరగ్ పనులను ప్రారంభించే విషయంలో ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్ సంబంధిత అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం ఉన్న చోట వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని, లేని పక్షంలో వాటిని రద్దు చేసుకుంటే వేరే గ్రామ పంచాయతీకి కేటాయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిర్వహణాపరమైన పనులను మాత్రం రద్దు చేసుకోకుండా వాటిని కూడా సకాలంలో ప్రారంభించేందుకు చొరవ చూపాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులను వేగవంతంగా జరిపించాలని, నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీపడవద్దని కలెక్టర్ సూచించారు. సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో క్యూరింగ్ ఎంతో ముఖ్యమైనదని, క్యూరింగ్ ఎంత చక్కగా జరిపిస్తే రోడ్డు మన్నిక ఎక్కువ కాలం పాటు ఉంటుందని అన్నారు.
కాగా, నియోజకవర్గ, ప్రత్యేక అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేసిన పనుల్లో కనీసం యాభై శాతం పనులు వారం రోజుల్లోపు ప్రారంభం కావాలని, ఈ మేరకు పెండిరగ్ పనులు ప్రారంభం అయ్యేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ డీ ఈలదేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే కనీసం ఐదు పనులను గుర్తించాలని ఎంపీడీవోలకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, జెడ్‌పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, ఆర్దీవోలు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏ.ఈలు, ఏపీవో లు పాల్గొన్నారు.