నిజామాబాద్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్ మధ్యన ఈవీఎం గోడౌన్ సీళ్లు తెరిపించారు. ఎక్కడెక్కడ, ఏయే మరమ్మతు పనులు చేపట్టాలనే దానిపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పక్కాగా నిబంధనలు పాటిస్తూ, పూర్తిగా సిసి కెమెరాల నిఘా నీడలో మరమ్మతు పనులు చేయించాలని అన్నారు. పనులు చేసేందుకు వచ్చే వారి పూర్తి వివరాలు సేకరించాలని, ఉదయం వేళలో పనిలో చేరే సమయంలో, అనంతరం పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా వారిని తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
గోడౌన్ లోని ఎన్నికల సామాగ్రిని వేరే గదిలోకి చేర్చి, దానిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ చేసిన మీదట, ఇతర గదుల మరమ్మతు పనులు చేసుకోవాలని, అవి పూర్తయిన పిదప ఎన్నికల సామాగ్రిని మరమ్మతు పనులు పూర్తయిన గదిలోకి మార్చి ఇతర చోట్ల పనులు చేయించాలన్నారు. ఎలాంటి లీకేజీలు, విద్యుత్ కనెక్షన్లలో లోపాలు వంటి వాటికి తావు లేకుండా పకడ్బందీగా, నాణ్యతతో పనులు జరిపించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఇక్కడే ఉండాలని, మినిట్స్ బుక్‌లో పూర్తి వివరాలు రాయాలని సూచించారు. పదేపదే మరమ్మతులు చేపట్టే అవసరం ఏర్పడకుండా పక్కాగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రణాళికాబద్దంగా పనులు జరిపించాలని, పది రోజుల వ్యవధిలో ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
ఈవీఎం గోడౌన్‌కు చెందిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి, వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని, మొక్కలు తాము సమకూరుస్తామని అన్నారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.