డిచ్‌పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులే కాకుండా ఉద్యోగ సిబ్బంది కూడా ఆటల్లో ప్రావీణ్యం సంపాదించడం ఆనందదాయకంగా ఉందన్నారు. గెలుపుతో పాటు ట్రోఫీని, 10 వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిబద్ధతను, నిబంధనలు, క్రమశిక్షణను అవలంబించి తమ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు.
కోవిద్ – 19 తర్వాత పునరుజ్జీవ కాంతులతో ఆట పాటలతో, చదువు సంధ్యలతో క్యాంపస్ కళకళ లాడుతుండడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్ వెలిసిన విషయాన్ని గుర్తుచేశారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో సిబ్బంది గెలుపొందడం వారి సమగ్ర కృషిని తెలుపుతుందన్నారు.
ఇక ముందు కూడా ఇంకా మంచి ప్రావీణ్యం సాధించడానికి విద్యార్థులకు ఆయా ఆటల్లో సామర్థ్యం గల శిక్షకుల చేత తర్ఫీదును అందించనన్నట్లు విసి తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అండ్ గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు, పిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) డా. బి. ఆర్. నేతా, పీఆర్‌ఓ డా. త్రివేణి, ఎఒ ఖాదర్ మొహియుద్దీన్, క్రీడాకారులు నరేష్, అశోక్, బికోజీ, శ్రీధర్, బబ్లూ, ఆసిఫ్, రవీందర్ నాయక్, సాయి, ఉదయ్, నరేష్, అఖిల్, దిగంబర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.