నిజాంసాగర్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబందు లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు.
అధికారులు గ్రామస్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్ల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
మల్లూరులో జిల్లా కలెక్టర్ దళితవాడను సందర్శించారు. లబ్ధిదారులతో యూనిట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోమలంచలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే దళిత వాడను సందర్శించారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసుకునే యూనిట్లపై చర్చించారు. లబ్ధిదారులు ఈ అవకాశం వినియోగించుకొని ఏడాదికి రెండు లక్షల ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.